MOVIE REVIEWS

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Fri Nov 25 2022 GMT+0530 (India Standard Time)

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్-ఆనంది-సంపత్-వెన్నెల కిషోర్-శ్రీతేజ్-కుమనన్ సేతురామన్-రఘుబాబు-ప్రవీణ్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: రాజేష్ దండ-జీ స్టూడియోస్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏఆర్ మోహన్

ఒకప్పుడు కామెడీతో కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ఒక మూసలో పడిపోయి వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీంతో కామెడీ జానర్ పక్కన పెట్టేసి ‘నాంది’ అనే సీరియస్ సినిమా చేస్తే మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు అదే వరుసలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చేశాడు. కొత్త దర్శకుడు ఏఆర్ మోహన్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ పాఠశాలతో తెలుగు ఉపాధ్యాయుడు. ఎవరైనా కష్టంలో ఉంటే కదిలిపోయి సాయం చేసే మనస్తత్వం అతడిది. శ్రీనివాస్ ఎన్నికల విధుల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమిల్లికి వెళ్లాల్సి వస్తుంది. ఐతే దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించి తాను ఎన్నికలు జరిపించాల్సిన ప్రాంతానికి వెళ్లడానికి శ్రీనివాస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక విద్య.. వైద్య.. రవాణా సౌకర్యాలు లేక ఆ ప్రాంత జనం పడుతున్న కష్టం శ్రీనివాస్ కు అర్థం అవుతుంది. ప్రజా ప్రతినిధులకు.. ప్రభుత్వ అధికారులకు తమ గోడు పట్టని నేపథ్యంలో తాము ఎన్నికల్లో ఓటు వేయమని అక్కడి జనాలు భీష్మించుకుని కూర్చుంటారు. అక్కడి జనాలను మార్చి వారు ఎన్నికల్లో పాల్గొనేలా చేస్తాడు శ్రీనివాస్. అతి కష్టం మీద ఎన్నికలు కూడా పూర్తి చేశాక శ్రీనివాస్.. అతడి సహచర ఉద్యోగిని మారేడుమిల్లి జనం కిడ్నాప్ చేస్తారు.. వాళ్లు అలా ఎందుకు చేశారు.. దీని వెనుక సూత్రధారి ఎవరు.. కిడ్నాప్ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారా.. శ్రీనివాస్ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డాడా అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

మంచి సినిమా.. ఈ మాట వింటే జనాలు ముఖం చాటేసే రోజులివి. సమస్యల మీద సినిమాలు తీస్తాం.. సందేశాలిస్తాం.. అంటే దండం పెట్టేస్తున్నారు ప్రేక్షకులు. అలాగే ట్రైలర్లలో సీరియస్ సినిమా అనే సంకేతాలు కనిపించినా అటు వైపు చూడట్లేదు. ఫిలిం మేకర్స్ కూడా ట్రెండుకు తగ్గట్లే సినిమాలు తీస్తుంటారు కాబట్టి.. సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియాల్సిన ఎన్నో విషయాలు మరుగున పడిపోతున్నాయి. అనేక కోణాలు వెలుగు చూడట్లేదు. ఇలాంటి టైంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ మోహన్ పెద్ద సాహసమే చేశాడు. అభివృద్ధికి చాలా దూరంగా ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే జనాలు.. తమ సమస్యల పోరాటం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అండతో చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తీశాడు. ఈ ప్లాట్ లైన్ చదవగానే ఇలాంటి సినిమాలు ఏం చూస్తాం.. ఈ రోజుల్లో ఇవేం నడుస్తాయి అనిపించొచ్చు. కానీ ఒక కాజ్ నేపథ్యంలో సాగే సినిమానే అయినా.. ఎన్నో పరిమితులు ఉన్నా.. కథనాన్ని వీలైనంత ఆసక్తికరంగా నడిపిస్తూ.. అక్కడక్కడా వినోదాన్ని కూడా జోడిస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాన్ని జనరంజకంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేక్షకులను ఈ చిత్రం సర్ప్రైజ్ చేయకపోవచ్చు కానీ.. రెండున్నర గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో.. అక్కడక్కడా ఎంటర్టైన్ చేయడంలో.. ఎమోషనల్ గా కదిలించడంలో.. అన్నింటికీ మించి ఒక ఆలోచన రేకెత్తించడంలో విజయవంతం అయింది.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కథేంటన్నది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఈ కథ అంత కొత్తదీ కాదు. మరీ ఎగ్జైట్ చేసేలా ఏమీ లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికలు జరిపించడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి పడే కష్టం నేపథ్యంలో ఇప్పటికే హిందీలో ‘న్యూటన్’ అనే సినిమా కూడా వచ్చింది. ఐతే మూల కథ వరకు కొంచెం దాంతో పోలిక ఉన్నా.. దీని నడత వేరు. కథేంటన్నది ఆరంభ సన్నివేశాలతోనే అర్థమైపోయినా.. తర్వాత ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచేలా ఆసక్తికర కథనంతో సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. సినిమా అంతా కూడా దాదాపుగా అడవిలోనే సాగడం వల్ల రెగ్యులర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు. సినిమా మొదలైన తీరు చూసి ఇది మరీ సీరియస్ మూవీనేమో అని భయం కలిగినా.. వెన్నెల కిషోర్ రంగ ప్రవేశంతో రిలీఫ్ వస్తుంది. అతడికి ప్రవీణ్ కూడా తోడయ్యాక చమక్కులకు లోటు లేకపోయింది. నరేష్ ఒకప్పట్లా లీడ్ తీసుకుని కామెడీ చేయకపోయినా.. కిషోర్-ప్రవీణ్ జోడీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కామెడీ డోస్ ఇస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చూశారు. ఎన్నికల విషయంలో పూర్తి విముఖతతో ఉన్న జనాలను మోటివేట్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ ముందుకు నడుస్తుంది. ఒక బలమైన.. హృద్యమైన ఘట్టంతో హీరో మీద అడవి బిడ్డల అభిప్రాయం మారుతుంది. అది ప్రేక్షకుల కళ్లను తడి చేస్తుంది. ఈ సినిమాలో ఆత్మ ఉందనే విషయం అప్పుడే అర్థమవుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక హీరో కిడ్నాప్ వ్యవహారంతో ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్టే ఇచ్చారు.

ఇక ద్వితీయార్ధంలో కిడ్నాప్ వెనుక అసలు కథ వెల్లడి కావడం.. ఆ తర్వాత హీరోను విడిపించడానికి ప్రభుత్వం చేేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఇక్కడ కొన్ని సీన్లు రిపిటీటివ్ గా అనిపించి కొంచెం బోర్ కొడుతుంది. ఐతే సరైన సమయంలో రఘుబాబు పాత్రను ప్రవేశ పెట్టి ఆసక్తి సన్నగిల్లిపోకుండా చూశాడు దర్శకుడు. ఆ పాత్ర మంచి ఎంటర్టైన్మెంట్ అందించి సినిమా గ్రాఫ్ పడిపోకుండా చూశాడు. ఇక ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ అన్నీ కూడా ఎమోషనల్ టచ్ తో సాగాయి. కలెక్టర్  పాత్రలో మార్పు వచ్చేలా హృద్యంగా సాగే పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను అవి కదిలిస్తాయి. ఐతే సినిమాలో సమస్య పరిధి చాలా ‘చిన్నది’గా అనిపించడం కొంచెం మైనస్ కావచ్చేమో. తెలుగు సినిమా హీరో అంటే సమస్యతో పాటు పరిష్కారం చాలా పెద్ద స్థాయిలో ఉండాలన్న మైండ్ సెట్ మనకు అలవాటైపోవడం వల్ల డిఫరెంట్ ఫీలింగ్ కలగొచ్చు. కానీ సమస్య ఏ స్థాయిది అన్నది పక్కన పెడితే.. దాని చుట్టూ ఎమోషన్ అయితే బలంగానే పండింది. స్లో నరేషన్.. సీరియస్ మూవీ అనే పరిమితులు కొన్ని ఉన్నప్పటికీ.. వీలైనంత మేర ఎంటర్టైన్ చేస్తూనే ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు:

గతంలో వరుసగా కామెడీ సినిమాలే చేసినప్పుడు కూడా.. వాటిలో సీరియస్-ఎమోషనల్ టచ్ ఉన్న సీన్లు పడితే వాటినీ బాగానే పండించేవాడు నరేష్. కాబట్టి అతను సీరియస్ పాత్రల్లోనూ చక్కగా నటిస్తుంటే ఆశ్చర్యమేమీ కలగదు. ‘నాంది’ లాంటి హార్డ్ హిట్టింగ్ మూవీలో ఎలా తన పాత్రను పండించాడో.. ఇందులో ఒక కాజ్ కోసం పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలోనూ అంతే సిన్సియర్ గా నటించి మెప్పించాడు. పాత్ర తాలూకు సిన్సియారిటీ.. ఇంటెన్సిటీ ఆద్యంతం కనిపించేలా నరేష్ ఆ పాత్రను పోషించిన విధానం ఆకట్టుకుంటుంది. లుక్ పరంగానూ నరేష్ ఆకట్టుకున్నాడు.  అవసరమైన చోట కథకు.. మిగతా పాత్రలకు అవకాశం ఇచ్చి అతను తగ్గడం అభినందనీయం. వెన్నెల కిషోర్ ఈ సీరియస్ మూవీలో అక్కడక్కడా మంచి పంచులేస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ అతడికి సహకరించాడు. కాసేపు రఘుబాబు కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. కలెక్టర్ పాత్రలో సంపత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ ఆనంది కాస్త చదువుకున్న అటవీ ప్రాంత అమ్మాయిని మెప్పించింది. ఇలాంటి పాత్రలకు అందరూ సూట్ కారు. ఆనంది లుక్స్.. తన నటన ఆ పాత్రకు చక్కగా సరిపోయాయి. హీరోయిన్ లాగా కాకుండా ఒక మామూలు అమ్మాయిలా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అడవి బిడ్డలుగా శ్రీతేజ్.. కుమనన్ సేతురామన్.. మిగతా నటీనటులందరూ కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

సినిమా శైలికి తగ్గట్లు సాంకేతిక హంగులన్నీ బాగానే కుదిరాయి. శ్రీ చరణ్ పాకాల పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఉన్న రెండు మూడు పాటలు సినిమాలో ఫ్లోలో బాగానే నడిచిపోయాయి. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా సాగింది. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. ఎన్నో పరిమితుల మధ్య అడవిలో చిత్రీకరణ కోసం ఛాయాగ్రాహకుడు.. ఆర్ట్ డైరెక్టర్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వారి కష్టానికి ఫలితం తెరపై కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి కథకు సపోర్ట్ చేసిన నిర్మాతలను కూడా అభినందించాలి. అబ్బూరి రవి ‘మంచి’ మాటలు చాలానే రాశారు. ”అన్యాయంగా బెదిరించే వాడి కంటే న్యాయంగా ఎదిరించే వాడే నిజమైన బలవంతుడు” తరహా మాటలు థియేటర్లో బాగా పేలాయి.  కథా రచయిత.. దర్శకుడు ఏఆర్ మోహన్ ప్రతిభ చాటుకున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయాలనుకోవడం సాహసమే. అలాగే హీరో నిర్మాతలను ఒప్పించగలగడం విశేషమే. ఎక్కడా రాజీ పడకుండా ఓ మంచి కథను సిన్సియర్ గా తెరపై ప్రెజెంట్ చేశాడతను. ఉన్న పరిమితుల్లో వినోదం కూడా బాగానే జోడించాడు.

చివరగా: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. మంచి ప్రయత్నం

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock