POLITICS

కుప్పం లాగే….చినబాబుకు మంగళగిరి టెన్షన్ …?

కుప్పం లాగే….చినబాబుకు మంగళగిరి టెన్షన్ …?

Mon Aug 29 2022 21:00:01 GMT+0530 (IST)

Mangalagiri Tension for Nara Lokesh

ఏపీలో ఇది కొత్త రాజకీయం కావచ్చు కానీ దేశంలో బీజేపీ దీన్ని చాలా దూకుడుగా వాడుతున్న పాలిటిక్స్. బహుశా బీజేపీతో చెలిమి చేస్తున్న కారణంగా వైసీపీకి ఈ తరహా పాలిటిక్స్ మీద ఆసక్తి పెరిగి ఉంటుంది. ఇంతకీ ఈ పాలిటిక్స్ ఏంటి అంటే అధినాయకుల మీదనే ఏకంగా గన్ గురి పెట్టడం. వారు ఆయా పార్టీలకు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటారు. వారు సేఫ్ జోన్ చూసుకుని తమకు బే ఫికర్ అని భావించి అక్కడ పోటీ చేస్తారు. ఆ తరువాత  మిగిలిన చోట్ల పార్టీకి ప్రచారం చేసుకుంటారు. అలా పార్టీకి ఎక్కువ సీట్లు దక్కేలా చేసుకుంటేనే అధికారంలోకి వచ్చేది.

అయితే రాజకీయ పద్మవ్యూహం పన్నినపుడు అధినాయకులు అందులో చిక్కుపడిపోతారు. వారు బయటకు వెళ్ళి తమ వారి కోసం పోరాడే టైమ్ ఉండదు అలా బీజేపీ దేశంలో పశ్చిమ బెంగాల్ లో ఈ తరహా ప్రయోగం చేసి మమతా బెనర్జీని ఓడించేసింది. ఆమె పక్కన ఉండే సువేందు అధికారి అనే ఒక కీలక నాయకుడిని తమ వైపునకు తిప్పుకుని మమతనే ఓడించి పారేసింది. ఆ తరువాత మమత వేవ్ ఉండబట్టి  పార్టీ గెలిచింది కానీ తన సీట్లోనే  మమత ఓడింది.

ఇది నిజంగా బీజేపీ వేసిన అనూహ్య రాజకీయ ఎత్తుగడ. అదే ఎన్నికల్లో బీజేపీకి కనుక ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే మమత పార్టీ అక్కడ ఏ రూపానా ఉండదు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా నడచిన ట్రెడిషనల్ పాలిటిక్స్ కి ఇది పూర్తిగా విరుద్ధం. ఇదే పంధాను వచ్చే ఎన్నికల్లో కేసీయార్ సొంత సీటు గజ్వేల్ లో కూడా బీజేపీ అమలు చేయబోతోంది. అక్కడ ఈటెల రాజేందర్ ని దింపాలని చూస్తోంది.

ఇక వైసీపీ కూడా సేమ్  స్ట్రాటజీని ఏపీలో అమలు చేయబోతోంది. ఇప్పటికే చంద్రబాబుకు కుప్పం ఫీవర్ ని నిండుగా పెట్టేసిన వైసీపీ రానున్న రోజుల్లో దాన్ని మరింతగా పెంచుకుని పోతుంది అనడంలో సందేహం లేదు. బాబు ఎంతసేపూ తన సీటూ అని కుప్పంలోనే తిరగాలి అన్న మాట. ఆ విధంగా ఆయన్ని అక్కడ చక్రబంధం చేసి ఏపీలో మిగిలిన  చోట్ల టీడీపీ వారిని ఓడించే పనిలో వైసీపీ ఫుల్ బిజీ అవుతుంది అంటున్నారు.

ఇక పెదబాబు సరే చినబాబుని కూడా  అసలు వదిలే  సీన్ లేదు అని సంకేతాలు ఇచ్చేసింది.  పోయిన ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రి హోదాలో పోటీ చేసి మరీ ఓడిన లోకేష్ ఈసారి కి కూడా అక్కడే అని రెడీ అవుతున్నారు. అయితే టీడీపీలోనే బలంగా ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైసీపీలోకి లేటెస్ట్ గా  తెచ్చేశారు. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం చాలా ఎక్కువ. గంజి చిరంజీవి కూడా తక్కువ నాయకుడు కాదు 2014 ఎన్నికల్లో ఆయన చాలా తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి మీద ఓడారు.

ఇక ఆయన తోడు ఉండడం వల్లనే లోకేష్ కి మంగళగిరిలో 2019 ఎన్నికల్లో బాగా ఓట్లు దక్కాయి. జస్ట్ అయిదు వేల ఓట్ల తేడాతో ఆళ్ల మీద లోకేష్ ఓడారు. ఈసారికి లోకేష్ కి సానుభూతి కూడా కలుస్తుంది అని అంచనాలు ఉన్నాయి. పైగా వైసీపీ మీద వ్యతిరేకత ఉంటుంది గెలుపు ఖాయం అని అనుకుంటున్న తరుణంలో గంజి చిరంజీవికి వైసీపీ కండువా కప్పేశారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే  ఆళ్ళ కూడా అటెండ్ అయ్యారూ అంటే అంతా కలిసే లోకేష్ మీద యుద్ధానికి రెడీ అయ్యారనుకోవాలి.

ఇక లోకేష్ గెలుపు మంగళగిరిలో ఈసారి సాధ్యమేనా అంటే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గంజి చిరంజీవి నిలబడితే మాత్రం కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే గంజి చిరంజీవి పక్కా లోకల్. పైగా చేనేత సామాజికవర్గం మద్దతు ఉంటుంది. వైసీపీ ఓట్లు జత అవుతాయి. దాంతో టఫ్ ఫైట్ సాగే సీన్ ఉంది. అలా తండ్రీ కొడుకుల సీట్లనే వైసీపీ ఫోకస్ చేసి ఇద్దరినీ రాజకీయ పద్మవ్యూహంలో బంధించేలా స్కెచ్ గీసి పెట్టింది. మరి దీన్ని ఎలా ఎదురుకుని అర్జునులై ప్రత్యర్ధులను ఇద్దరు బాబులు నిర్జించి బయటకు వస్తారో చూడాలి. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో అటు కుప్పం ఇటు మంగళగిరి సీట్లు వెరీ ఇంటరెస్టింగ్ గా మారబోతున్నాయి అన్నది నిజమంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock